

కరీంనగర్ నగరంలోని దీర్ఘకాలిక డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు నగరపాలక సంస్థ చర్యలు చేపడుతోందని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. 41వ డివిజన్‌లో పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛ భారత్ మిషన్ కింద రూ.17 కోట్లతో బయోమైనింగ్ ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించి స్థానిక ప్రజల ఇబ్బందులను తొలగిస్తామని హామీ ఇచ్చారు.
అలాగే, యూసీఎఫ్ పథకం కింద డంపింగ్ యార్డులో చెత్త ప్రాసెసింగ్ పనుల కోసం రూ.80 కోట్లు కేటాయించినట్లు మేయర్ వెల్లడించారు. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఆ పనులను కూడా ప్రారంభిస్తామని తెలిపారు. అంతకుముందు కట్టరాంపూర్‌లో రూ.12 లక్షల నగరపాలక సంస్థ సాధారణ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్ నాంపల్లి కవిత శ్రీనివాస్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. డివిజన్‌లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నగర అభివృద్ధికి తమ పాలకవర్గం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!