

సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 5న కార్మికుల బ్యాంకు ఖాతాల్లో బోనస్ జమ చేయనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. పనితీరు ఆధారిత ప్రోత్సాహక బోనస్ కింద మొత్తం రూ.419 కోట్లను చెల్లించనున్నారు. ఒక్కో కార్మికుడికి గరిష్టంగా రూ.1,10,250 బోనస్ అందనుంది. ఈ మేరకు సింగరేణి యాజమాన్యానికి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే దసరా సందర్భంగా లాభాల వాటా బోనస్ కింద దాదాపు రూ.600 కోట్లు చెల్లించగా, తాజాగా దీపావళి బోనస్ ప్రకటించడంతో కార్మికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రాష్ట్రానికి వెలుగులు పంచుతున్న సింగరేణి సంస్థ అభివృద్ధి, విస్తరణకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ఈ బోనస్ సుమారు 38 వేల మంది సింగరేణి కార్మికులకు వర్తించనుంది. అయితే ఇది జాతీయ బొగ్గు వేతన ఒప్పందం (ఎన్‌సీడబ్ల్యూఏ) పరిధిలోని ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. అధికారులకు వర్తించదు. గత ఆర్థిక సంవత్సరంలో భూగర్భ గనుల్లో కనీసం 190 పని దినాలు, బహిరంగ గనులు, ఉపరితల విభాగాల్లో 240 పని దినాలు పూర్తి చేసిన వారికి పూర్తి బోనస్ అందుతుంది. అంతకంటే తక్కువ రోజులు పనిచేసిన వారికి హాజరు ఆధారంగా నిష్పత్తి ప్రకారం చెల్లిస్తారు. బోనస్ పొందేందుకు కనీసం 30 పని దినాలు పూర్తి చేసి ఉండాలి. సింగరేణి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి నవంబర్ 5న కార్మికుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దసరా, దీపావళి బోనస్‌లతో కలిపి ఒక్కో కార్మికుడికి సగటున సుమారు రూ.2.65 లక్షలు అందనున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!