

సమ్మతితో కొనసాగిన ప్రేమ సంబంధంలో విభేదాలు తలెత్తినంత మాత్రాన, గతంలో ఏర్పడిన శారీరక సాన్నిహిత్యాన్ని అత్యాచారంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సంబంధాలు విఫలమైన తర్వాత వాటిని క్రిమినల్ కేసులుగా మార్చే ధోరణి పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. కేరళకు చెందిన ఓ వ్యక్తిపై నమోదైన అత్యాచారం, మోసం కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అత్యాచారం, మోసం అనే ఆరోపణల మధ్య స్పష్టమైన తేడాను గుర్తించాలని ఈ సందర్భంగా న్యాయస్థానం పేర్కొంది.
వివరాల్లోకి వెళ్తే.. అప్పటికే వివాహమైన విషయాన్ని దాచిపెట్టి ఓ వ్యక్తి తనను రెండో వివాహం చేసుకున్నాడని బాధితురాలు ఆరోపించారు. విషయం తెలిసిన తర్వాత అతడి నుంచి విడాకులు తీసుకున్నట్లు తెలిపారు. తనను మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నాడంటూ అత్యాచారం, మోసం, నమ్మకద్రోహం ఆరోపణలతో కేసు నమోదు చేశారు. ఈ కేసును పరిశీలించిన సుప్రీంకోర్టు.. పరస్పర అంగీకారంతో కొనసాగిన సంబంధం విఫలమైన తర్వాత, ఆ బంధంలోని సాన్నిహిత్యాన్ని అత్యాచారంగా చిత్రీకరించలేమని స్పష్టం చేసింది. విఫలమైన వ్యక్తిగత సంబంధాలను క్రిమినల్ కేసులుగా మార్చే ముందు ఆరోపణల స్వభావాన్ని, అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించాల్సిన అవసరాన్ని న్యాయస్థానం నొక్కిచెప్పింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!