

కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఇరవత్రి అనిల్ కుమార్ బీఆర్ఎస్ నేత హరీశ్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితికి హరీశ్ రావు ధనదాహమే కారణమని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన హరీశ్ రావుపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన తప్పిదాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.
మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ సభ్యుడు సమీర్ కుమార్ శుక్లే ఇచ్చిన నివేదికను ఇరవత్రి అనిల్ ప్రస్తావించారు. తొలుత స్టిల్లింగ్ బేసిన్ మరమ్మతులను పరిశీలించిన సాంకేతిక కమిటీ, తదుపరి అధ్యయనంలో ప్రాజెక్టులో నాణ్యతా లోపాలు ఉన్నట్లు గుర్తించిందని తెలిపారు. శాస్త్రీయ ప్రమాణాలు పాటించకుండా బ్యారేజీల నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పిదాలకు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బాధ్యుడిని చేయడం సరికాదన్నారు. బ్యారేజీ గేట్ల విషయంలో ఎన్డీఎస్ఏ సూచనలను పక్కనపెట్టి నీటిని ఎత్తిపోయాలని బీఆర్ఎస్ నేతలు కోరడాన్ని ప్రశ్నించారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను బీఆర్ఎస్ ప్రభుత్వం దెబ్బతీసిందని ఆరోపిస్తూ, రాష్ట్ర ప్రజలకు ఆ పార్టీ నేతలు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!