

తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన ఫార్ములా ఈ రేస్ నిధుల మళ్లింపు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పాస్‌పోర్టుకు సంబంధించి రీజనల్ పాస్‌పోర్ట్ ఆఫీస్ (RPO) జారీ చేసిన నోటీసులపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ వ్యవహారంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని ఆదేశించింది. పాస్‌పోర్ట్ అధికారుల నోటీసులను సవాలు చేస్తూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.
ఫార్ములా ఈ రేస్ కేసు దర్యాప్తులో భాగంగా కేటీఆర్ పాస్‌పోర్టును స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) అధికారులు రీజనల్ పాస్‌పోర్ట్ ఆఫీస్‌కు లేఖ రాసినట్లు సమాచారం. ఏసీబీ విజ్ఞప్తి మేరకు పాస్‌పోర్ట్ అధికారులు కేటీఆర్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను సవాలు చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు, ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న ఏసీబీ, పాస్‌పోర్ట్ అధికారులకు నోటీసులు పంపింది. తదుపరి విచారణను నవంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ మధ్యంతర ఉత్తర్వులతో పాస్‌పోర్ట్ నోటీసుల వ్యవహారంలో కేటీఆర్‌కు తాత్కాలిక ఊరట లభించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!