

అధిక బరువుతో బాధపడేవారు బరువు తగ్గాలంటే ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం అవసరం. అయితే బరువు తగ్గే క్రమంలో ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహార పదార్థాలను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. వాటికి బదులుగా తక్కువ క్యాలరీలు, మెరుగైన పోషక విలువలు కలిగిన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవచ్చు. ఉదాహరణకు, ఫుల్ క్రీమ్ పాలకు బదులుగా డబుల్ టోన్డ్ పాలను ఉపయోగించవచ్చు. వీటిలో కొవ్వు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే చక్కెరకు బదులుగా తేనె తీసుకోవడం వల్ల క్యాలరీలు తగ్గుతాయని భావించడం సరైంది కాదు. తేనెలోనూ చక్కెరతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువ క్యాలరీలు ఉండవచ్చు. కాబట్టి చక్కెర, తేనె రెండింటినీ పరిమితంగా తీసుకోవడం మంచిది. అవసరమైతే వైద్య నిపుణుల సూచనతో తగిన స్వీటెనర్లను ఎంచుకోవచ్చు.
బరువు తగ్గాలనుకునేవారు మాంసాహారాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. చికెన్ తీసుకునేవారు చర్మం తొలగించిన చికెన్ బ్రెస్ట్‌ను ఎంచుకోవచ్చు. ఇందులో ప్రొటీన్లు అధికంగా, కొవ్వు తక్కువగా ఉంటాయి. అయితే చికెన్‌లోని క్యాలరీలు వండే విధానాన్ని బట్టి మారుతాయి. అలాగే పండ్ల రసాల కంటే పండ్లను నేరుగా తినడం మంచిది. జ్యూస్ తయారీ సమయంలో పీచు పదార్థం తగ్గే అవకాశం ఉండటంతో పాటు, ఎక్కువ పండ్లను ఒకేసారి తీసుకునే పరిస్థితి ఉంటుంది. నేరుగా పండ్లు తినడం వల్ల పీచు పదార్థం లభించడంతో పాటు కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. అందువల్ల ఆహారాన్ని పూర్తిగా మానేయడం కంటే ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం, పరిమాణాన్ని నియంత్రించడం బరువు తగ్గడంలో తోడ్పడతాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!