

భారతీయ ఓటీటీ ప్రేక్షకులను నవ్వులతో అలరించిన ప్రముఖ కామెడీ డ్రామా సిరీస్ ‘పంచాయత్’ మరోసారి సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ సిరీస్ ఐదో సీజన్ విడుదల తేదీని అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 3 నుంచి కొత్త సీజన్ స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. దీంతో వచ్చే ఏడాది వరకు వేచి చూడాల్సి వస్తుందనే అభిమానుల సందేహాలకు తెరపడింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్.. “కొన్ని గొడవలు, మరికొంత ప్రేమతో ఫులేరా మీ కోసం ఎదురుచూస్తోంది” అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించారు. ఇటీవల ఈ సిరీస్‌లో విలన్‌గా కనిపించే భూషణ్ అలియాస్ బన్‌రాకస్ షోను హైజాక్ చేశాడని, అందుకే 2026లో కొత్త సీజన్ రాదంటూ ప్రైమ్ వీడియో సరదాగా చేసిన ప్రచారం కూడా అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.
అయితే అదంతా కేవలం ప్రమోషన్‌లో భాగమేనని తాజాగా విడుదల తేదీ ప్రకటనతో స్పష్టమైంది. గత సీజన్ ఫులేరా గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సాగిన రాజకీయ పరిణామాలు, మంజు దేవి (నీనా గుప్తా), క్రాంతి దేవి (సునీతా రాజ్‌వర్) మధ్య జరిగిన పోటీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ఎన్నికల్లో క్రాంతి దేవి విజయం సాధించి కొత్త ప్రధాన్‌గా బాధ్యతలు చేపట్టినా, అధికార వ్యవహారాల్లో ఆమె భర్త భూషణ్ (దుర్గేష్ కుమార్) కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ఐదో సీజన్‌లో భూషణ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చి ఫులేరా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తాడా? లేక అవన్నీ కేవలం రాజకీయ ఎత్తుగడలుగానే మిగిలిపోతాయా? అన్నది ఆసక్తికరంగా మారింది. కొత్త సీజన్‌లో ఎలాంటి మలుపులు చోటుచేసుకుంటాయో చూడాలంటే డిసెంబర్ 3 వరకు వేచి చూడాల్సిందే.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!