
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వ్యాపార నష్టాలు, పెరిగిన అప్పులు మరియు బ్యాంకర్ల వేధింపుల కారణంగా రైస్‌మిల్ యజమాని భార్య ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన తణుకు సురేశ్ మరియు స్వప్న (42) దంపతులు మండలంలోని మొలంగూర్ శివారులో రైస్‌మిల్ నిర్వహిస్తున్నారు. 2021–2022 సంవత్సరాల్లో కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద ప్రభుత్వం వారి మిల్లుకు ధాన్యం కేటాయించింది. అయితే అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసి తీవ్ర నష్టం వాటిల్లింది.
వ్యాపారం కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు పెరగడంతో బకాయిలు చెల్లించాలని ఒత్తిడి పెరిగింది. ఈ పరిస్థితుల వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన స్వప్న శుక్రవారం ఉదయం ఇంట్లోని బాత్రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు ఇప్పటికే వివాహం కాగా, చిన్న కుమార్తె హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. భర్త సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!