

గోవాలో జరిగిన భయంకర అగ్ని ప్రమాదంలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద స్థలాన్ని సీఎం ప్రమోద్ సావంత్ స్వయంగా సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలు, క్లబ్లో ఉన్న భద్రత లోపాలు ఏవన్నీ అధికారుల దగ్గర నుంచి వివరంగా అడిగి తెలుసుకున్నారు. “ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపడతాం. ముగ్గురు మహిళలు, నలుగురు పర్యాటకులు సహా 23 మంది మరణించడం చాలా బాధాకరం. క్లబ్లో సేఫ్టీ నిబంధనలు పాటించలేదని ప్రాథమిక సమాచారం లభించింది. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు” అని సీఎం పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రమాదం రాత్రి పన్నెండు గంటల సమయంలో బాగా బీచ్ సమీపంలోని ‘Birch by Romeo Lane’ నైట్ క్లబ్లో జరిగింది. సిలిండర్ పేలడం వల్ల మంటలు చెలరేగాయని శంకిస్తున్నారు. ఫైర్ టెండర్లు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించగా, ఆదివారం ఉదయం వరకు రక్షణ చర్యలు కొనసాగాయి.
ఈ దారుణ ఘటనపై సీఎం ప్రమోద్ సావంత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. క్లబ్లో నిబంధనలు పాటించకపోవడమే ఈ విషాదానికి కారణమని అధికారులు స్పష్టంచేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం మరోసారి హెచ్చరించారు. ఘటన స్థలాన్ని ఎమ్మెల్యే మైఖేల్ లోబో కూడా పరిశీలించి, భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా భద్రత ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని చెప్పారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!