

ప్రపంచ వినియోగ వస్తు రంగంలో అగ్రగామిగా ఉన్న యూనిలీవర్ సంస్థ హైదరాబాద్లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ ఏర్పాటు చేసే అవకాశాలపై ఆసక్తి వ్యక్తం చేసింది. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాల సందర్భంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం యూనిలీవర్ చీఫ్ సప్లై చైన్ అండ్ ఆపరేషన్స్ ఆఫీసర్ విల్లెమ్ ఉయిజెన్తో భేటీ అయింది. ఈ సమావేశంలో తెలంగాణలో జీసీసీ ఏర్పాటు అంశంపై విస్తృతంగా చర్చలు జరిగాయి. హైదరాబాద్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లకు వేగంగా కేంద్రంగా మారుతోందని సీఎం వివరించగా, దీనిని యూనిలీవర్ సానుకూలంగా పరిశీలిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ హైదరాబాద్లో ఇప్పటికే మెక్డొనాల్డ్స్, హైనెకెన్, కాస్టకో వంటి ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థల జీసీసీలు విజయవంతంగా పనిచేస్తున్నాయని చెప్పారు. తెలంగాణ వ్యాపారాలకు అనుకూల రాష్ట్రంగా ఉందని, వేగవంతమైన అనుమతులు, లైసెన్సింగ్ ప్రక్రియలు అందిస్తున్నామని తెలిపారు. సమావేశంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా తెలంగాణ రైజింగ్ బృందం, పారిశ్రామిక పార్కుల్లో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాలని యూనిలీవర్ను ఆహ్వానించింది. వాతావరణ పరిరక్షణ, నీటి సంరక్షణ, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు వంటి యూనిలీవర్ లక్ష్యాలను తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి, సర్క్యులర్ ఎకానమీ కార్యక్రమాలతో అనుసంధానం చేసే అంశాలపై కూడా చర్చలు జరిగాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!