

తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీని తగ్గించే దిశగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలోని అలిపిరి ప్రాంతంలో 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ను నిర్మించాలని నిర్ణయించింది. ఈ టౌన్షిప్ ద్వారా తిరుమల పై భక్తుల ఒత్తిడి తగ్గించడంతో పాటు, అవసరమైన సౌకర్యాలను తిరుపతి లోనే అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడైంది.
మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో నిర్వహించిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాకు తెలిపారు. అలిపిరిలో ఉన్న టీటీడీ శిల్ప కళాశాల ప్రాంతంలోనే ఈ టౌన్‌షిప్‌ను నిర్మిస్తామని, ప్రస్తుతం అక్కడ ఉన్న శిల్ప కళాశాలను మరో ప్రాంతానికి తరలించనున్నట్లు చెప్పారు.
ఈ టౌన్షిప్లో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు కనీస వసతి సదుపాయాలు, అన్నదానం, వాహనాల పార్కింగ్ వంటి కీలక సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీని ద్వారా తిరుమలకు వెళ్లకుండానే భక్తులు అవసరమైన ఏర్పాట్లు చేసుకునే అవకాశం కలుగుతుందని టీటీడీ భావిస్తోంది.
అదే సమయంలో తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయాన్ని మరింత ఆధునికంగా అభివృద్ధి చేయడానికి అదనంగా రూ.48 కోట్ల నిధులను మంజూరు చేయడానికి ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఈ ఆస్పత్రి అభివృద్ధికి సుమారు రూ.230 కోట్లు కేటాయించగా, అవసరం లేని కొన్ని నిర్మాణాలకు సంబంధించిన టెండర్లను రద్దు చేసినట్లు చైర్మన్ వెల్లడించారు.
ఈ సమావేశంలో టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తదితర అధికారులు పాల్గొన్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!