

రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాన్ ఆర్మీలో చేరిన భారతీయుల పరిస్థితి మరోసారి ఆందోళన కలిగిస్తోంది. పంజాబ్‌కు చెందిన జగ్దీప్ కుమార్ తన తమ్ముడు మందీప్ కుమార్ కోసం రష్యాకు వెళ్లి తిరిగి వచ్చిన అనంతరం చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. రష్యాన్ ఆర్మీ జారీ చేసిన పత్రాల ఆధారంగా కనీసం 10 మంది భారతీయులు యుద్ధంలో మృతి చెందినట్లు, మరో నలుగురు కనిపించకుండా పోయినట్లు ఆయన ఆరోపించారు.
మృతుల్లో ముగ్గురు పంజాబ్‌కు చెందినవారు కాగా, మిగిలిన వారు ఉత్తరప్రదేశ్, జమ్మూ ప్రాంతాలకు చెందినవారని జగ్దీప్ తెలిపారు. ఉద్యోగాల ఆశ చూపిన ట్రావెల్ ఏజెంట్లు భారతీయ యువతను మోసం చేసి రష్యాకు పంపారని, అక్కడ వారిని బలవంతంగా సైన్యంలో చేర్చినట్లు ఆయన చెప్పారు. తన తమ్ముడు మందీప్ కుమార్‌తో 2024 మార్చి తర్వాత ఎలాంటి సంప్రదింపులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయాన్ని ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ బల్బీర్ సింగ్ సీచేవాల్ కు తెలియజేయగా, ఎంపీ వెంటనే కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ ను కలిసి ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని కోరారు.
ఇదిలా ఉండగా, భారత ప్రభుత్వం గత సెప్టెంబర్‌లోనే ఈ అంశం పై రష్యా ప్రభుత్వంతో చర్చలు జరిపి, భారతీయుల రిక్రూట్‌మెంట్‌ను నిలిపివేయాలని, ఇప్పటికే చేరిన వారిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ ఘటన విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసాలు చేస్తున్న ఏజెంట్ల పై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ను మరింత బలపరుస్తోంది. ఇప్పటికే కొందరు భారతీయులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నప్పటికీ, మిగిలినవారి కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!