

ఈ నెల 10 వ తేదీ సాయంత్రం నుంచి విజయవాడ బైపాస్‌లో వాహనాల రాకపోకల్లో మార్పులు అమలు కానున్నాయి. గొల్లపూడి వైపు నుంచి వచ్చే కార్లు, ద్విచక్ర వాహనాలను హాయ్‌ల్యాండ్ రోడ్ వరకు వెళ్లేందుకు అనుమతించనున్నారు.
ఇప్పటి వరకు కృష్ణా నది, సీడ్ యాక్సెస్ రోడ్ దాటిన తర్వాత వాహనాలను బైపాస్ నుంచి మళ్లించి మందడం మార్గం ద్వారా సచివాలయం, హైకోర్టు వైపు పంపిస్తున్నారు. ఇక పై గొల్లపూడి నుంచి గుంటూరు వైపు వెళ్లే వాహనాలు కూడా హాయ్‌ల్యాండ్ రోడ్ వరకు వెళ్లే అవకాశం కల్పించనున్నారు. ఈ ఏర్పాట్లను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు చేస్తున్నారు.
ప్రస్తుతం బైపాస్‌లో టోల్ ప్లాజా దాటిన తర్వాత ముందుకు వెళ్లే అవకాశం లేదు. అయితే 10 వ తేదీ నుంచి ఆ నిబంధనను సడలించి హాయ్‌ల్యాండ్ రోడ్ వరకు అనుమతిస్తారు. అక్కడి నుంచి సుమారు 200 మీటర్లు ప్రయాణించి చెన్నై–కోల్‌కతా సర్వీస్ రోడ్లోకి చేరుకోవచ్చు. తొలుత ఈ సౌకర్యం కార్లు, బైక్‌లకు మాత్రమే ఉంటుంది.
ఈ నెల 20 నుంచి గొల్లపూడి నుంచి వచ్చే లారీలు, భారీ వాహనాలను కూడా గుంటూరు వైపు అనుమతించనున్నారు. వచ్చే నెలలో విజయవాడ బైపాస్‌ను చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారితో పూర్తిగా అనుసంధానించే పనులు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!