

అమెరికాతో వాణిజ్య ఒప్పందం, రష్యా చమురు కొనుగోళ్ల అంశాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరి అయోమయం కొనసాగుతోంది. రష్యా చమురు కొనుగోళ్లు నిలిపివేస్తారా అనే ప్రశ్నకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సమాధానం దాటవేస్తూ వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌ను సంప్రదించాలన్నారు. అదే ప్రశ్నను పీయూష్ గోయల్‌కు వేయగా, అది విదేశాంగ శాఖ పరిధిలోని అంశమని చెప్పడంతో చర్చ మరింత ముదిరింది. ఈ అంశాలపై ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇదిలా ఉండగా, రష్యా చమురు కొనుగోళ్లపై భారత్ హామీ ఇచ్చిందంటూ అమెరికా అదనపు 25 శాతం సుంకాలను తొలగిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. భారత్, రష్యా చమురును కొనుగోలు చేస్తే మళ్లీ అదే సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. అయితే భారత్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని రష్యా స్పష్టం చేసింది. మరోవైపు భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై సంయుక్త ప్రకటనలో కేవలం మధ్యంతర ఫ్రేమ్‌వర్క్ మాత్రమే ఖరారైందని వెల్లడైంది. 18 శాతం సుంకాల తగ్గింపు ఇంకా అమల్లోకి రాలేదు. ఒప్పందంలోని రక్షణలు, భారత ఎగుమతులపై ప్రభావం, సుంకాల తగ్గింపు ఎప్పటి నుంచి అమలవుతాయన్న అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని వాణిజ్య వర్గాలు పేర్కొంటున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!