

గ్రేటర్ హైదరాబాద్ లో ఫుట్‌బాల్ క్రీడ అభివృద్ధికి జీహెచ్ఎంసీ పెద్ద నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ నగరం లో ప్రత్యేక ఫుట్‌బాల్ స్టేడియం లేకపోవడంతో, మూడు చోట్ల ఆధునిక సదుపాయాలతో స్టేడియాలు నిర్మించేందుకు బల్దియా ప్రణాళికలు సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు అధికారులు డిజైనింగ్ పనులను వేగవంతం చేశారు.
కాప్రా, మల్లేపల్లి, రెడ్ హిల్స్ ప్రాంతాల్లో ఈ స్టేడియాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. మొత్తం రూ.15 కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నారు. కాప్రా సర్కిల్ లోని గెలీలియోనగర్ లో 2.25 ఎకరాల్లో రూ.6 కోట్లు, రెడ్ హిల్స్‌లో 1.25 ఎకరాల్లో రూ.4.90 కోట్లు, మల్లేపల్లి లో 1.5 ఎకరాల్లో రూ.4.85 కోట్ల తో ఫుట్‌బాల్ స్టేడియాలు నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు.
గత నెల 20 న స్టాండింగ్ కమిటీ ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అనంతరం కౌన్సిల్ కూడా వీటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూడు చోట్ల అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా గ్యాలరీలు, ఆధునిక లే అవుట్లు, ఆకర్షణీయమైన స్టేడియం డిజైన్లను రూపొందించాలని జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలను నిర్వహించేలా గ్రౌండ్లను సిద్ధం చేయేందుకు సిద్ధమవుతోంది.
టెండర్ ప్రక్రియను ఈ నెలలోనే చేపట్టే అవకాశమున్నట్లు సమాచారం. ముందుగా ఎల్బీ స్టేడియాన్ని ఫుట్‌బాల్ గ్రౌండ్ గా మార్చాలన్న ఆలోచన ఉన్నా అది జరగకపోవడంతో, అందుబాటులో ఉన్న ప్రాంతాలను పరిశీలించి చివరికి ఈ మూడు స్థలాలను ఫైనల్ చేశారు.
మూడింటి నిర్మాణ పనులను మూడు నెలల్లో పూర్తి చేయాలని అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. గత ఏడాదిన్నరగా ప్రాజెక్ట్ పై చర్చలు సాగినా, సరైన స్థలాలు దొరకకపోవడంతో ఆలస్యం జరిగింది. ఇప్పుడు సీఎం ఆదేశాలతో ప్రక్రియ వేగం పుంజుకుంది.
ఈ స్టేడియాలు పూర్తవుతే నగరంలో ఫుట్‌బాల్ క్రీడకు కొత్త ఊపిరి చేరనుందని, యువ క్రీడాకారులకు ఉత్తమ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని జీహెచ్ఎంసీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!