

గ్రామీణాభివృద్ధి, సుస్థిర పరిపాలనలో విశిష్ట ప్రతిభ కనబరుస్తూ తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు (DDUPSVP) కింద రాష్ట్రానికి చెందిన పంచాయతీలు అవార్డులు సాధించడం విశేషం.
వికారాబాద్ జిల్లా కోటేపల్లి మండల పరిధిలోని మోతుకుపల్లి గ్రామ పంచాయతీ “గుడ్ గవర్నెన్స్” విభాగంలో అవార్డు దక్కించుకుంది. గ్రామ స్థాయిలో పారదర్శక పరిపాలన, ప్రజల భాగస్వామ్యం, అభివృద్ధి కార్యక్రమాల సమర్థవంతమైన అమలులో చూపిన ప్రతిభకు ఈ గుర్తింపు లభించింది. అలాగే సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలంలోని ఫసల్వాడి గ్రామ పంచాయతీ “విమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ” విభాగంలో జాతీయ అవార్డుకు ఎంపికైంది. మహిళా సాధికారత, భద్రత, సంక్షేమ కార్యక్రమాల అమలులో చూపిన కృషికి ఈ పురస్కారం లభించింది.
దేశవ్యాప్తంగా గ్రామీణాభివృద్ధి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో ముందంజలో ఉన్న పంచాయతీలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులు ప్రదానం చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు రెండు విభాగాల్లో అవార్డులు రావడం పట్ల పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క హర్షం వ్యక్తం చేశారు. అవార్డులు అందుకున్న మోతుకుపల్లి, ఫసల్వాడి గ్రామ పంచాయతీల ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థాయి సిబ్బందిని ఆమె అభినందించారు. ఇటువంటి విజయాలు ఇతర పంచాయతీలకు ప్రేరణగా నిలుస్తాయని ఆమె పేర్కొన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!