

రాష్ట్రంలో గ్రూప్స్‌కు ఎంపికైన అభ్యర్థుల్లో ఎంతమంది ఉద్యోగాల్లో చేరారన్న విషయంపై ప్రభుత్వం సమీక్ష ప్రారంభించింది. ఎంపికైన వారు నిర్ణీత గడువులోగా చేరారా లేదా అనే వివరాలను అందించాలని అన్ని శాఖలను ఆదేశించింది. ఉద్యోగాల్లో చేరని అభ్యర్థుల కారణంగా మిగిలిన ఖాళీల వివరాలను సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖలకు అందించాలని, వాటిని తదుపరి నియామక ప్రకటనల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే గ్రూప్-1 నియామకాలు పూర్తికాగా, గ్రూప్-2లో 783, గ్రూప్-3లో 1,365, గ్రూప్-4లో 8,180 పోస్టులు భర్తీ అయ్యాయి.
నిబంధనల ప్రకారం అభ్యర్థులు 60 రోజుల్లోగా ఉద్యోగంలో చేరాలి. లేకపోతే ఆ పోస్టును వదిలేసినట్లుగా భావించి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో గడువు పొడిగింపు కూడా ఇస్తారు. గ్రూప్-1, 2 ఫలితాలు గత సెప్టెంబరులో, గ్రూప్-3 డిసెంబరులో, గ్రూప్-4 నియామకాలు ఏడాది క్రితమే పూర్తయ్యాయి. అయినప్పటికీ ఇంకా చేరని అభ్యర్థులు ఉండటంతో ప్రభుత్వం వారి వివరాలు సేకరిస్తోంది. కొందరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, మరికొందరు మెరుగైన పోస్టులను ఎంపిక చేసుకున్నారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా నాన్-జాయినింగ్ వివరాలు వెంటనే ఇవ్వాలని శాఖలకు లేఖలు పంపింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!