

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం లో అన్యమత ప్రార్థనలు, బోధనలు, ప్రచారాలు, అలాగే సోషల్ మీడియా కోసం రీల్స్ చేయడం పై దేవస్థానం కఠిన ఆంక్షలు విధించింది. ఇలాంటి చర్యలు చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘించిన వారి పై తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
శ్రీశైలం క్షేత్ర పరిధిలో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ అన్యమత ప్రార్థనలు నిర్వహించడం, బోధనలు ఇవ్వడం, ప్రచార కార్యక్రమాలు చేయడం పూర్తిగా నిషేధమని తెలిపారు. అలాగే అన్యమతాలకు సంబంధించిన కరపత్రాలు, పుస్తకాలు పంచడం లేదా అలాంటి కార్యకలాపాలు నిర్వహించడం కూడా నేరమేనని స్పష్టం చేశారు.
దేవస్థానం అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఆలయ ప్రాంగణంలో వీడియోలు తీయడం, డ్రోన్లు ఎగురవేయడం, వ్యక్తిగత రీల్స్‌ను సోషల్ మీడియాలో ప్రచారం చేయడం అనుమతిలేదని ఈవో పేర్కొన్నారు. అంతేకాదు, క్షేత్ర పరిధిలో ధూమపానం, మద్యపానం, జూదం ఆడటం, మాంసాహారాలు సేవించడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం కూడా చట్టవిరుద్ధమేనని హెచ్చరించారు.
దేవాదాయ ధర్మాదాయ నిబంధనలను ఉల్లంఘించి, చట్ట విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులు నిబంధనలను గౌరవించి పాటించి, దేవస్థానం అధికారులకు సహకరించాలని ఈవో శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.
ఇటీవల శ్రీశైలం దేవాలయ ప్రాంగణంలో ఓ యువతి రీల్స్ చేయడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆలయ నిబంధనలు ఉల్లంఘించారని, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించారంటూ పలువురు నెటిజన్లు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విమర్శలపై స్పందించిన యువతి, తాను సాంప్రదాయంగా చీర కట్టుకుని మాత్రమే రీల్స్ చేశానని, ఆలయ ప్రాంగణంలో రీల్స్ చేయలేదని వివరణ ఇచ్చింది. తప్పు జరిగితే క్షమించాలని కోరుతూ వీడియో విడుదల చేసింది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఈవో తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!