

తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు చేసిన సిట్, అప్పటి మరియు ప్రస్తుత ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అప్పటి అదనపు ఈవో ధర్మారెడ్డి, ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ బాలాజీలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాసింది. కల్తీ నెయ్యి కేసులో కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసిన అనంతరం, 14 పేజీల నివేదికలో చివరి భాగంగా ఈ సూచనలను సిట్ చేసింది. నెయ్యి సరఫరాలో నాణ్యతా ప్రమాణాలను బలహీనపరిచేలా వ్యవహరించారని, నిబంధనల రూపకల్పనలో నిర్లక్ష్యం వల్ల నెయ్యి నాణ్యతలో రాజీ జరిగిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌ను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా, శని–ఆదివారాల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
సిట్ నివేదిక ప్రకారం, 2019కు ముందు అమల్లో ఉన్న కఠిన నిబంధనలను వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సవరించారు. టెండర్లలో పాల్గొనే డెయిరీలకు పాలు, వెన్న సేకరణ, నెయ్యి తయారీ సామర్థ్యం వంటి కీలక అర్హతలను సడలించారు. అలాగే మూడేళ్ల కార్యకలాపాల నిబంధనకు మినహాయింపు ఇవ్వడం, టర్నోవర్ పరిమితిని రూ.250 కోట్ల నుంచి రూ.150 కోట్లకు తగ్గించడం వంటి మార్పులు చేశారు. ఈ సడలింపుల కారణంగానే 2019 నుంచి 2024 మధ్య కాలంలో సుమారు 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి టీటీడీకి సరఫరా అయిందని సిట్ స్పష్టం చేసింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!