

హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులపై వెట్టింగ్ ప్రక్రియను ప్రారంభించిన అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా భారీ సంఖ్యలో హెచ్-1బీ, హెచ్-4 వీసాలను ‘ప్రుడెన్షియల్ రద్దు’ చేసినట్లు సమాచారం. ఈ మేరకు తమ వర్కింగ్ వీసాలు రద్దయ్యాయని పలువురు వీసాదారులకు అమెరికా కాన్సులేట్ నుంచి ఈమెయిల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. హెచ్-1బీ, హెచ్-4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలపై వెట్టింగ్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
అయితే ఈ ప్రుడెన్షియల్ వీసా రద్దు శాశ్వతమైంది కాదని ఇమిగ్రేషన్ అటార్నీ ఎమిలీ నాయ్మెన్ స్పష్టం చేశారు. ఇది తాత్కాలిక చర్య మాత్రమేనని, వీసాదారుల చట్టబద్ధ నివాస హక్కుపై దీనివల్ల ప్రభావం ఉండదని తెలిపారు. అయితే తదుపరి వీసా అపాయింట్మెంట్ సమయంలో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని దరఖాస్తులను మరింత క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.
ప్రభుత్వానికి వీసాదారుల అర్హతలపై అనుమానం ఏర్పడినప్పుడు విదేశాంగ శాఖ ఈ విధమైన తాత్కాలిక రద్దు చర్యలు చేపడుతుందని అధికారులు వివరిస్తున్నారు. ఈ సమయంలో వీసా స్టాంప్ చెల్లుబాటు కాకపోయినా, వీసా గడువు పూర్తయ్యే వరకు అమెరికాలో నివసించవచ్చు. అయితే ఒకసారి దేశం విడిచి వెళ్తే, వీసా గడువు ఉన్నప్పటికీ మళ్లీ ప్రవేశానికి అనుమతి ఉండదు. ఇదిలా ఉండగా, హెచ్-1బీ, హెచ్-4తో పాటు ఎఫ్, ఎం, జే వీసాలకు దరఖాస్తు చేసినవారు తమ సోషల్ మీడియా ఖాతాలను పబ్లిక్‌గా ఉంచుకోవాల్సి ఉంటుందని అధికారులు సూచించారు. ఈ నిబంధనల కారణంగా ఇప్పటికే అనేక వీసా ఇంటర్వ్యూలు వాయిదా పడినట్లు తెలుస్తోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!