

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. స్వెట్టర్లు, దుప్పట్లు కప్పుకున్నా వణుకు తగ్గడం లేదు. డిసెంబర్ ప్రారంభం నుంచే చలి పంజా విసురుతుండగా, గత రెండు వారాలుగా ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఉదయం 8 గంటలే కాదు.. 10 గంటల వరకూ కూడా బయటకు రావడానికి ప్రజలు వెనకాడే పరిస్థితి నెలకొంది. తీవ్రమైన చలితో పాటు దట్టమైన పొగమంచు కూడా జనజీవనాన్ని ఇబ్బంది పెడుతోంది. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత కఠినంగా ఉండే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
తెలంగాణలో వచ్చే మూడు రోజులు వాతావరణ పరిస్థితి
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో దిగువ స్థాయి గాలులు తూర్పు–ఈశాన్య దిశ నుంచి వీస్తున్నాయి. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగనుంది. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉంది. దీంతో రాత్రి, తెల్లవారుజామున చలి తీవ్రత ఎక్కువగా ఉండనుంది.
ఆంధ్రప్రదేశ్లో మూడు రోజుల వాతావరణ అంచనా
అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ మరియు యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. దీని కారణంగా రాబోయే మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతుంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో గురువారం, శుక్రవారం, శనివారం వర్ష సూచనలు లేవు. అయితే వచ్చే రెండు రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో ఒకటి రెండు చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తరువాత పెద్దగా మార్పులు ఉండవని స్పష్టం చేసింది.
మొత్తంగా చూస్తే.. వచ్చే మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగనుంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!