

అమరావతిలో నేషనల్ జ్యుడిషియల్ అకాడమీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను కోరారు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మధ్యవర్తిత్వంపై రాష్ట్రస్థాయి సదస్సులో పాల్గొన్న ఆయన, రాజధానిలో జస్టిస్ సిటీ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. జ్యుడిషియల్ అకాడమీ, లీగల్ సర్వీసెస్ అథారిటీ, మీడియేషన్ సెంటర్, ఇంటర్నేషనల్ లా యూనివర్శిటీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలను సమగ్రంగా ఏర్పాటు చేసి దేశంలోనే ఉత్తమ న్యాయ కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దుతామని చెప్పారు. అవసరమైన భూములు, మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని పేర్కొన్నారు.
మధ్యవర్తిత్వం ద్వారా కేసులను వేగంగా పరిష్కరించడం వల్ల ప్రజలకు సత్వర న్యాయం అందుతుందని సీఎం వివరించారు. గ్రామ స్థాయిలో కూడా మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించేందుకు కేసులు పరిష్కరించిన వారికి ప్రోత్సాహక నగదు అందించే విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. బ్లూ-గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తూ, ల్యాండ్ పూలింగ్ ద్వారా 29 వేల మందికి పైగా రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని చెప్పారు. వికసిత్ భారత్-2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి కొనసాగుతోందని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు మరియు పలువురు న్యాయ రంగ ప్రముఖులు హాజరయ్యారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!