

సంక్రాంతి పండగ రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ కొనసాగుతుండగా, ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు అధిక ఛార్జీలు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. పండగ అవకాశాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని బస్సుల్లో రెండు నుంచి మూడు రెట్లు టికెట్ ధరలు పెంచుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నవారు పండగ కోసం స్వగ్రామాలకు చేరుకోగా, తిరుగు ప్రయాణంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అధిక ఛార్జీలపై నెల్లూరు ప్రాంతీయ రవాణా శాఖ అధికారి మహ్మద్ మదని నేతృత్వంలో ఎంవీఐలు బాలమురళీకృష్ణ, రఘువర్ధన్ రెడ్డి, కార్తీక్ రెడ్డి రెండు రోజుల పాటు తనిఖీలు నిర్వహించారు. ఆదివారం 45 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.4.50 లక్షలు, సోమవారం 70 బస్సులపై రూ.7 లక్షల జరిమానా విధించారు. అయినప్పటికీ ట్రావెల్స్ నిర్వాహకుల్లో మార్పు కనిపించడం లేదు. హైదరాబాద్కు ఓ ఏసీ స్లీపర్ టికెట్కు రూ.5,000 వరకు వసూలు చేయడం కలకలం రేపింది. నెల్లూరు నుంచి హైదరాబాద్, బెంగళూరు మార్గాల్లో రూ.2,000 నుంచి రూ.4,800 వరకు ఛార్జీలు వసూలు చేస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!