

అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుపై సాగిన కస్టడీ విచారణ బుధవారంతో ముగిసింది. విచారణ పూర్తయ్యాక సిట్ అధికారులు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, గురువారం తెల్లవారుజామున ఆయనను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి విడుదల చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 19 వరకు ఆయన కస్టడీ కొనసాగిన విషయం తెలిసిందే.
డిసెంబర్ 12 న పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన ప్రభాకర్ రావును హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల సిట్ బృందం 14 రోజుల పాటు విచారించింది. విచారణ చివరి రోజున కేసులో సహ నిందితులైన ప్రణీత్ రావు, భుజంగ రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్నలను కూడా పిలిపించి విడివిడిగా ప్రశ్నించి కీలక సమాచారాన్ని సేకరించారు.
విచారణలో భాగంగా ఉద్యోగ విరమణ తర్వాత తన పునర్నియామకంపై ప్రశ్నించగా, ఆ విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అడగాలని ప్రభాకర్ రావు సూచించినట్లు సమాచారం. అలాగే హరీశ్‌రావుతో తరచూ సంప్రదింపులకు కారణం మావోయిస్టుల నుంచి ఉన్న ప్రాణహాని నేపథ్యంలో భద్రతా సూచనలు ఇవ్వడమేనని తెలిపారు. తన విధుల్లో భాగంగా ఉన్నతాధికారులకు కాకుండా నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికే నివేదికలు సమర్పించేవాడినని కూడా సిట్‌కు వెల్లడించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, సిట్ విచారణ ముగిసిన నేపథ్యంలో ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్, సిట్ చీఫ్ సజ్జనార్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు గురువారం రాత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. దర్యాప్తు పురోగతితో పాటు ప్రముఖులకు నోటీసుల జారీ అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!