

అమెరికా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం అనూహ్యంగా వేలాది మంది భారతీయులకు పెద్ద ఇబ్బందులు కలిగించింది. సోషల్ మీడియా ప్రొఫైళ్ల పరిశీలన పేరుతో, ఈ నెలలో జరగాల్సిన హెచ్1బీ వీసా ఇంటర్వ్యూలను ఆకస్మికంగా వాయిదా వేసింది. ఇప్పటికే అపాయింట్మెంట్లు బుక్ చేసుకుని, ఈ ఇంటర్వ్యూల కోసం భారత్‌కు వచ్చిన వారికి ఈ మార్పు భారీ షాక్‌గా మారింది. ఇంటర్వ్యూ లేకుండా వారు తిరిగి అమెరికా వెళ్లే అవకాశం లేకుండా పోయింది.
అమెరికా వలస సేవలు వ్యక్తిగతంగా పంపిన ఈమెయిళ్లలో, హెచ్1బీతో పాటు మరికొన్ని వీసా కేటగిరీల ఇంటర్వ్యూలను కూడా రీషెడ్యూల్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 15 న ఇంటర్వ్యూకు హాజరవ్వాల్సిన వారికి వచ్చే ఏడాది మార్చి తేదీలు కేటాయించగా, 19 వ తేదీ తర్వాతి స్లాట్లు ఉన్నవారిని మే నెలకు మార్చారు.
ఎంతమంది అభ్యర్థులకు ఈమెయిళ్లు పంపారన్న వివరాలు వెల్లడించనప్పటికీ, పాత తేదీల్లో కాన్సులేట్‌కు రావొద్దని అమెరికా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. కొత్త తేదీకి సంబంధించిన వివరాలకు సహాయం అందిస్తామని తెలియజేసింది. రీషెడ్యూల్ ఈమెయిల్ వచ్చిన అభ్యర్థులు మాత్రమే తాజా తేదీలకు హాజరుకావాలని హెచ్చరించింది.
వీసా ఇంటర్వ్యూల వాయిదా పై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నో పోస్టులు, ఫిర్యాదులు బయటకు వచ్చాయి. చెన్నైలో 18 వ తేదీన ఇంటర్వ్యూ ఉన్న అభ్యర్థి ఒకరు, బయోమెట్రిక్స్ ఇచ్చిన వెంటనే తన అపాయింట్మెంట్ వచ్చే ఏడాది ఏప్రిల్ 30 కు మార్చబడిందని సోషల్ మీడియాలో వివరించారు.
హ్యూస్టన్‌కు చెందిన ఇమిగ్రేషన్ అటార్నీ ఎమిలీ న్యూమాన్ ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. హెచ్1బీ స్టాంపింగ్ ప్రక్రియ పూర్తిగా అనిశ్చితిలో పడిపోయిందని, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే అపాయింట్మెంట్లు నెలల తరబడి వాయిదా వేయడం వలస వ్యవహారాల్లో తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుందని, వ్యాపారవేత్తలు మరియు ఉద్యోగులు భారీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె విమర్శించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!