

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రణీత్ రావుకు డీఎస్పీ హోదాను రద్దు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు కీలక పాత్ర పోషించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు గతంలో ఇచ్చిన యాక్సిలరేటెడ్ పదోన్నతిని ప్రభుత్వం రద్దు చేసింది.
ప్రభుత్వ ఉత్తర్వులతో ప్రణీత్ రావును డీఎస్పీ స్థాయి నుంచి నేరుగా సీఐ స్థాయికి డిమోట్ చేశారు. ఈ మేరకు హోంశాఖ ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇకపై ప్రణీత్ రావు ఇన్స్పెక్టర్ హోదాలోనే కొనసాగనున్నారు. సాధారణంగా ఉగ్రవాద నిరోధక చర్యల్లో విశేష సేవలు అందించిన అధికారులకే యాక్సిలరేటెడ్ పదోన్నతి ఇస్తారని అధికారులు చెబుతున్నారు.
2007 బ్యాచ్‌కు చెందిన 300 మంది ఎస్సైల్లో కేవలం ప్రణీత్ రావుకే అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేకంగా పదోన్నతి కల్పించడంపై అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత రేవంత్ ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. ఈ కేసులో పలుమార్లు విచారించిన దర్యాప్తు అధికారులు ప్రణీత్ రావు నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!