

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ నేపథ్యంతో తెరకెక్కిన సినిమాపై వివాదం నెలకొంది. ‘టి.ఎన్. 2026’ సినిమాను విడుదల చేయకుండా నిలిపివేయాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దేశీయ మక్కల్ శక్తి కడ్చి అధ్యక్షుడు ఎం.ఎల్. రవి ఈ పిటిషన్ వేసి, ఏప్రిల్ 10న విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని వాదించారు. ఈ సినిమాలో ఒక స్టార్ హీరో రాజకీయాల్లోకి ప్రవేశించి ముఖ్యమంత్రిగా ఎదిగే కథ ఉండటంతో, అది ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చిన హీరో విజయ్ను పోలి ఉందని పిటిషనర్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల ముందు ఇలాంటి రాజకీయ చిత్రం విడుదలైతే ప్రజల ఓటింగ్‌పై ప్రభావం పడుతుందని ఆయన పేర్కొన్నారు.
అయితే చిత్ర కథా రచయిత తంబి రామయ్య ఈ ఆరోపణలను ఖండిస్తూ, ఈ కథకు విజయ్‌తో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇది ఏ ఒక్కరి జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించలేదని, సాధారణ రాజకీయ కథ మాత్రమేనని తెలిపారు. ఏడాది క్రితమే ఈ కథ రాసి షూటింగ్ పూర్తి చేశామని వెల్లడించారు. ఇప్పటికే టీజర్ విడుదలై సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన ఈ చిత్రం, ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో వివాదానికి దారితీసింది. సెన్సార్ బోర్డు అనుమతి ఉన్నప్పటికీ, ఎన్నికల ముందు ఈ సినిమా విడుదలపై తుది నిర్ణయం కోర్టు తీసుకోనుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!