

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను పద్మ అవార్డులను ప్రకటించింది. తొలి దశలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన 45 మంది ప్రముఖులను పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా మట్టిలో మాణిక్యాలుగా గుర్తింపు పొందిన వారి సేవలకు గౌరవంగా ఈ ప్రకటన వెలువడింది. పూర్తి జాబితాను త్వరలోనే విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఎంపికైన వారిలో సాహిత్యం, విజ్ఞానం, సామాజిక సేవ, సంప్రదాయ కళలు, వ్యవసాయం, పశుసంవర్థక రంగాల్లో కృషి చేసిన పలువురు ఉన్నారు. కర్ణాటకకు చెందిన అంకె గౌడ, హైదరాబాద్ సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, మధ్యప్రదేశ్‌కు చెందిన భగవాన్‌దాస్ రాయికర్, గుజరాత్‌కు చెందిన ధార్మిక్లాల్ చునిలాల్ పాండ్య వంటి వారు ఈ గౌరవాన్ని అందుకున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన సాధారణ నేపథ్యం కలిగిన వ్యక్తుల సేవలకు ఈ అవార్డులు దక్కడం విశేషంగా నిలిచింది.
తెలంగాణ నుంచి రామారెడ్డి మామిడి పద్మశ్రీకి ఎంపికయ్యారు. పశుసంవర్థక, పాడి పరిశ్రమ అభివృద్ధికి ఆయన చేసిన కృషికి ఈ పురస్కారం వరించింది. మరోవైపు డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ మానవ పరిణామ క్రమం, జన్యు సంబంధ వ్యాధులపై మూడు దశాబ్దాలుగా చేసిన పరిశోధనలకు గాను అంతర్జాతీయ గుర్తింపు పొందారు. ఈ ఎంపికలు రాష్ట్రానికి గర్వకారణంగా మారాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!