

అవును.. ఇది నిజమే. దివంగత జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీలతో మాట్లాడే అవకాశం త్వరలో అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ఢిల్లీలోని ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది. కృత్రిమ మేధ ఆధారిత 3డీ అవతారాల రూపంలో ఈ మహానేతలు సందర్శకుల ముందుకు వచ్చి వారితో సంభాషించనున్నారని సంగ్రహాలయ డైరెక్టర్ అశ్వనీ లోహనీ తెలిపారు. ఈ సాంకేతికత ద్వారా సందర్శకులు మరోసారి చరిత్రలోకి వెళ్లిన అనుభూతిని పొందుతారని చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు తుది దశలో ఉందని, వచ్చే నెల నెలాఖరులోగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.
ఇప్పటికే మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం రూపాల్లో ఏఐ ఆధారిత మాట్లాడే ప్రదర్శనలను ఏర్పాటు చేశామని, వాటికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని తెలిపారు. ఏప్రిల్ 14 నాటికి ఈ మ్యూజియం నాలుగేళ్లు పూర్తి చేసుకుంటోందని, రోజుకు సగటున 1,500 మంది సందర్శకులు వస్తున్నారని వివరించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!