

రాజమహేంద్రవరం, విశాఖపట్నం నగరాల మధ్య కొత్త విమానాశ్రయం నిర్మాణానికి అనువైన స్థలం ఎంపిక అంశం అనకాపల్లి, కాకినాడ జిల్లాల మధ్య చర్చనీయాంశంగా మారింది. గతంలో కాకినాడ జిల్లాలోని అన్నవరం–తుని మధ్య గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం నిర్మించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినప్పటికీ, భూసేకరణకు రైతుల వ్యతిరేకతతో పాటు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆ ప్రతిపాదన నిలిచిపోయింది. అనంతరం పాయకరావుపేట–నక్కపల్లి మధ్య గోపాలపట్నం పరిసర ప్రాంతాలను కూడా పరిశీలించినా ఆ ప్రణాళిక ముందుకు సాగలేదు.
ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా తొమ్మిది విమానాశ్రయాల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రణాళికలో పెట్టగా, ఇందులో భాగంగా తుని–అన్నవరం మధ్య విమానాశ్రయం కోసం సవివర ప్రణాళిక నివేదిక (డీపీఆర్) సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ తెలిపింది. కాకినాడ, ఉప్పాడ ప్రాంతాల్లో భారీ పరిశ్రమలు, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ యూనిట్లు, ఆర్సెలార్ మిత్తల్ ఉక్కు పరిశ్రమ, ఎన్టీపీసీ విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పడనున్న నేపథ్యంలో విమానాశ్రయం పారిశ్రామికాభివృద్ధికి కీలకంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. తుని ప్రాంతంలో భూముల అనుకూలత సమస్యలు కొనసాగితే పాయకరావుపేట ప్రత్యామ్నాయంగా పరిగణించే అవకాశముందని సమాచారం.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!