

అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా, అసాధారణ విద్యావేత్తగా పేరొందిన నైనా జైస్వాల్ మరో గొప్ప మైలురాయిని సాధించింది. తాజాగా ఆమె ఎల్ఎల్ఎం (మాస్టర్ ఆఫ్ లా) కోర్సును ఫస్ట్ డివిజన్ విత్ డిస్టింక్షన్లో పూర్తి చేసినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇది తన రెండో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అని, ఈ విజయం తనకు ఎంతో ప్రత్యేకమని నైనా ఆనందం వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా తన భవిష్యత్ లక్ష్యాలపై కూడా ఆమె స్పష్టత ఇచ్చింది. ఇది ముగింపు కాదని, ఒక బలమైన ఆరంభం మాత్రమేనని తెలిపింది. మరింత పెద్ద లక్ష్యాలతో తదుపరి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నానని ఆమె పేర్కొంది. చిన్న వయసులోనే చదువులో అసాధారణ విజయాలు సాధించిన నైనా, న్యాయశాస్త్రంలో ఉన్నత విద్య పూర్తి చేసి మరోసారి వార్తల్లో నిలిచింది.
నైనాకు ఎన్నో అరుదైన విద్యా రికార్డులు ఉన్నాయి. 8 ఏళ్లకే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఐజీసీఎస్ఈ విధానంలో 10వ తరగతి, 10 ఏళ్లకే ఇంటర్మీడియట్, 13 ఏళ్లకే జర్నలిజంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. 15 ఏళ్ల వయసులో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేసి, ఆసియాలోనే అతి తక్కువ వయసులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వ్యక్తిగా రికార్డు సాధించింది. 22 ఏళ్లకే మహిళా సాధికారతపై పరిశోధన చేసి పీహెచ్డీ సాధించింది. చదువుతో పాటు క్రీడల్లోనూ ఆమె సత్తా చాటింది. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక విజయాలు సాధించి, నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!