

చర్లపల్లి రైల్వేట్రాక్‌పై తల్లి తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. శనివారం తెల్లవారుజామున గూడ్స్ రైలు కింద పడి ముగ్గురు మృతి చెందగా, ఈ ఘటనపై సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలు విజయరెడ్డి సెల్‌ఫోన్, ల్యాప్‌ట్యాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. ప్రాథమిక విచారణలో ఆమె ఈ ఘోర నిర్ణయం తీసుకోవడానికి ఒంటరితనం ప్రధాన కారణంగా ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
శుక్రవారం సాయంత్రం విజయరెడ్డి హాస్టళ్లలో ఉన్న తన ఇద్దరు పిల్లలను తీసుకొచ్చి, సొంత కారులో చర్లపల్లి రైల్వేస్టేషన్ పార్కింగ్‌లో వాహనాన్ని నిలిపినట్టు పోలీసులు గుర్తించారు. పార్కింగ్ స్లిప్ వెనుకభాగంలో “తనకు జీవించాలని లేదని, తాను లేకపోతే పిల్లలు ఒంటరవుతారని” పేర్కొంటూ ఓ సూసైడ్ నోట్ రాసి కారులో వదిలినట్టు సమాచారం. అదే లేఖను ఫొటో తీసి వాట్సప్ స్టేటస్‌గా కూడా పెట్టినట్టు పోలీసులు వెల్లడించారు. అనంతరం పిల్లలతో కలిసి రైల్వేట్రాక్‌పైకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించగా, ఆదివారం సాయంత్రం బీబీనగర్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. విజయరెడ్డి–సురేందర్‌రెడ్డిల వివాహం 2007లో జరిగింది. నాలుగేళ్ల క్రితం సురేందర్‌రెడ్డికి దుబాయ్‌లో ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్లారు. విజయరెడ్డి హైదరాబాద్‌లోని ఉప్పల్ డిపో రాఘవేంద్రనగర్‌లో తల్లి పుష్పలతతో కలిసి పిల్లలతో నివసిస్తూ, ఓ ఐటీ కంపెనీలో టీమ్ లీడర్‌గా పనిచేస్తున్నారు. నైట్ షిఫ్టులు ఉండటంతో పిల్లలను హాస్టళ్లలో చదివిస్తున్నారు.
భర్త దూరంగా ఉండటం, ఉద్యోగ ఒత్తిళ్లు, కుటుంబ బాధ్యతలన్నింటినీ ఒంటరిగా మోయడం వల్ల ఆమె మానసికంగా కుంగిపోయినట్టు సమాచారం. ఇటీవల ఈ విషయాన్ని బంధువులు, స్నేహితుల వద్ద ప్రస్తావిస్తూ బాధ వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేకపోయామని, అంత్యక్రియల సమయంలో కుటుంబసభ్యులు కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఘటనపై విజయరెడ్డి మొబైల్లోని చివరి కాల్స్, చాటింగ్ వివరాల ఆధారంగా ఆమెతో పని చేసిన ఇద్దరు టీమ్ సభ్యులను పోలీసులు విచారించారు. అవన్నీ ఉద్యోగానికి సంబంధించిన సందేశాలేనని తేలినట్టు తెలిపారు. కుటుంబ విభేదాలు, ఆస్తి సంబంధిత తగాదాల కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ విషాద ఘటనపై ఆదివారం సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరిగింది. మహిళల ఒంటరితనం, మానసిక ఒత్తిళ్లపై సమాజం మరింత సున్నితంగా స్పందించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!