

భాగస్వామ్య దేశాల నౌకాదళాల మధ్య పరస్పర సామర్థ్యాల పెంపు, స్నేహపూర్వక సంబంధాల బలోపేతానికి మిలన్-2026 కీలక వేదికగా నిలుస్తుందని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలోని సముద్రిక ఆడిటోరియంలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వాతావరణ మార్పుల వల్ల ప్రకృతి విపత్తులు పెరుగుతున్న నేపథ్యంలో మానవతా సహాయక చర్యలు మరింత అవసరమవుతున్నాయని అన్నారు. ఎంత శక్తివంతమైన నౌకాదళమైనా ఒంటరిగా ఈ సవాళ్లను ఎదుర్కోలేదని, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా నావిగేషన్ స్వేచ్ఛ, సమాన సముద్ర అవకాశాలు ఉండాలని భారత్ అభిప్రాయమని తెలిపారు.
ఈ ఏడాది 74 దేశాల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న మిలన్ కార్యక్రమం ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద సంచికగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. సముద్ర ఉగ్రవాదం, అక్రమ చేపల వేట, స్మగ్లింగ్, సైబర్ నేరాలను సమిష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. ఈ సందర్భంగా తొమ్మిది ఆసియా దేశాల నౌకాదళాధిపతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, ఇండో-పసిఫిక్ ప్రాంత భద్రతా అంశాలపై చర్చించారు. భారత్ అభివృద్ధి చేసిన రక్షణ సాంకేతికతలను భాగస్వామ్య దేశాలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి, తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా పాల్గొన్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!