

జార్ఖండ్ రాష్ట్రం సింగ్భూమ్ జిల్లాలో గురువారం భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. కిరిభూమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. పక్కా సమాచారంతో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో తీవ్ర కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్ ప్రాంతం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
దేశవ్యాప్తంగా మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్‌ను అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా వంటి మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్లు తీవ్రతరం అయ్యాయి. గత కొంతకాలంగా వరుస ఎన్కౌంటర్లలో పలువురు అగ్రనేతలు మృతి చెందగా, వందలాది మంది మావోయిస్టులు ప్రభుత్వానికి లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్య ప్రాంతంపై భద్రతా బలగాలు ఇప్పటికే పూర్తి ఆధిపత్యం సాధించాయి. మిగిలిన కేంద్ర కమిటీ నేతలను లక్ష్యంగా చేసుకొని సరిహద్దు రాష్ట్రాల అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు ఆపరేషన్లను మరింత ముమ్మరం చేస్తున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!