

ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ ప్రమాదం త్రుటిలో తప్పింది. టాక్సింగ్ సమయంలో ఎయిరిండియా, ఇండిగో విమానాల రెక్కలు పరస్పరం ఢీ కొన్నాయి. ఈ ఘటనలో రెండు విమానాల్లో ఉన్న ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయటపడ్డారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ స్పష్టం చేసింది. తనిఖీల కోసం విమానాలు కదులుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు వెల్లడించింది.
డీజీసీఏ వివరాల ప్రకారం, ఎయిరిండియాకు చెందిన AI 2732 విమానం కోయంబత్తూర్కు వెళ్లేందుకు పార్కింగ్ బే నుంచి రన్వే వైపు కదులుతోంది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి ల్యాండ్ అయిన ఇండిగో విమానం 6E791 పార్కింగ్ బే వైపు వెళ్తుండగా రెక్కలు పరస్పరం ఢీ కొన్నాయి. ఈ ఘటనలో రెండు విమానాల రెక్కలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. పార్కింగ్ అనంతరం ప్రయాణికులను సురక్షితంగా దింపినట్లు ఇండిగో తెలిపింది. కోయంబత్తూర్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానాన్ని మరమ్మతుల కోసం తరలించగా, ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!