

ప్రధాని నరేంద్ర మోదీ సహా భారత అధికారుల నుంచి అమెరికా నేతలకు అందిన బహుమతుల వివరాలను తాజాగా అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. 2024 సంవత్సరానికి సంబంధించి విదేశీ ప్రభుత్వాల నుంచి తమ అధికారులకు లభించిన గిఫ్ట్‌లను అధికారిక జాబితాలో చేర్చినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ చీఫ్ ఆఫ్ ప్రొటోకాల్ కార్యాలయం తెలిపింది. ఈ జాబితాలో ప్రత్యక్ష బహుమతులతో పాటు ప్రయాణ సమయంలో అందిన కానుకలను కూడా పొందుపరిచారు.
2023లో భారత్‌లో జరిగిన జీ20 సదస్సు సందర్భంగా అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రధాని మోదీ బహూకరించిన గంధపు చెక్క పెట్టె, స్కార్ఫ్, కుంకుమ పువ్వు, టీ పొడి ఉన్న చెక్క పెట్టె, ‘ది టెన్ ప్రిన్సిపల్ ఉపనిషద్స్’ అనువాద పుస్తకాన్ని అమెరికా జాతీయ ఆర్కైవ్స్ (NARA)కు తరలించారు. పాడయ్యే వస్తువులైన కుంకుమ పువ్వు, టీ పొడిని సీక్రెట్ సర్వీస్ నిబంధనల మేరకు తొలగించారు. ఈ బహుమతుల మొత్తం విలువ రూ.51,640గా పేర్కొన్నారు. అలాగే 2024 జులైలో బైడెన్‌కు ఇచ్చిన స్టెర్లింగ్ సిల్వర్ ట్రైన్ సెట్, జిల్ బైడెన్‌కు అందజేసిన కశ్మీర్ పాష్మినా షాల్, కమలా హారిస్‌కు ఇచ్చిన లార్డ్ కృష్ణ రాస్ లీలా సిల్వర్ బాక్స్‌లను కూడా ఎన్ఏఆర్ఏలో భద్రపరిచినట్లు వెల్లడించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ఇచ్చిన కానుకల వివరాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!