

రైళ్లలో ప్రయాణికులపై జిప్ ఆపరేటింగ్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు (జీఆర్పీ) మరియు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) ప్రత్యేక బృందాలు ఇవాళ అరెస్ట్ చేశాయి. నిందితుల నుంచి సుమారు రూ.25 లక్షల విలువైన 21 తులాల (210 గ్రాములు) బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
కర్ణాటకకు చెందిన కొకిల మణిరాజు (39), తమిళనాడుకు చెందిన ఎస్. దీనా (27)లను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. వీరిద్దరూ దొంగతనాలకు అలవాటైన నేరస్తులని తెలిపారు. డిసెంబర్ 2 న నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ కోచ్‌కు టికెట్లు బుక్ చేసుకుని విశాఖపట్నంలో ప్రయాణికుల్లా రైలు ఎక్కిన నిందితులు, చర్లపల్లి వరకు ప్రయాణిస్తూ ఇద్దరు మహిళా ప్రయాణికుల బ్యాగుల జిప్‌లు తెరిచి బంగారు ఆభరణాలు ఉన్న పర్సులను దొంగిలించినట్లు తెలిపారు.
చోరీ అనంతరం మరో కోచ్‌కు మారి చర్లపల్లిలో దిగిపోయిన నిందితులను పోలీసులు ట్రాక్ చేసి, గురువారం ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గేట్ నెం.2 సమీపంలో మరో నేరానికి సిద్ధమవుతుండగా పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. నిందితులను న్యాయ స్థానంలో హాజరు పరిచినట్లు పోలీసులు వెల్లడించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!