

భారత్‌లో తొలి వందేభారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కింది. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ అధునాతన రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైల్లో ప్రయాణించే విద్యార్థులతో మాట్లాడిన ఆయన, రైలు లోపలికి వెళ్లి అందులోని సౌకర్యాలను పరిశీలించారు. ఈ వందేభారత్ స్లీపర్ రైలు పశ్చిమ బెంగాల్‌లోని హావ్‌డా నుంచి అస్సాంలోని గువాహటి (కామాఖ్య) వరకు రాకపోకలు సాగించనుంది.
ఈ రైలు గంటకు గరిష్ఠంగా 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. కోటా నుంచి నాగ్దా మధ్య నిర్వహించిన తుది పరీక్షల్లో, రైల్వే భద్రత కమిషనర్ సమక్షంలో ఈ వేగాన్ని విజయవంతంగా సాధించింది. అధిక వేగంలో కూడా కంపనం లేకుండా ప్రయాణిస్తుందనే విషయాన్ని గతంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రస్తావించారు.
మొత్తం 16 కోచ్‌లతో కూడిన ఈ రైలులో ఏసీ స్లీపర్ బెర్తులు, ఆధునిక సస్పెన్షన్ వ్యవస్థ, అగ్ని గుర్తింపు పరికరాలు, సీసీటీవీ నిఘా వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. విమాన ప్రయాణ అనుభూతిని కలిగించేలా రూపొందించిన ఈ రైల్లో కనీస ఛార్జీ రూ.960 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్ట్‌కు అవకాశం ఉండదు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!