

టెక్నాలజీ యుగంలో రాకెట్లతో అంతరిక్ష ప్రయాణాలు సాగుతున్నప్పటికీ, కొన్ని మూఢనమ్మకాలు ఇంకా ప్రజల జీవన విధానం పై ప్రభావం చూపుతూనే ఉన్నాయి. అమావాస్య రోజుల్లో ప్రయాణాలు మంచివి కావని భావించడం, గ్రహణం సమయంలో గర్భిణీలు బయటకు వెళ్లకూడదన్న నమ్మకాలు ఇప్పటికీ అనేక చోట్ల కొనసాగుతున్నాయి.
ఈ పరిస్థితి 2026 జనవరి 18 న మరోసారి స్పష్టంగా కనిపించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి సొంతూర్లకు వెళ్లిన వారు, సెలవులు ముగియడంతో తిరిగి నగరానికి రావాల్సి ఉన్నప్పటికీ, ఆ రోజు మౌని అమావాస్య కావడంతో చాలామంది ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. అమావాస్య వేళ ప్రయాణాలు మంచివి కావని భావిస్తూ ఊర్లోనే ఉండిపోయారు.
దీంతో సాధారణంగా పండుగల అనంతరం రద్దీగా కనిపించే విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి (NH 65) పై వాహనాల రాక నెమ్మదిగా కొనసాగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లోని పంతంగి టోల్ ప్లాజా వద్ద సాధారణంగా కనిపించే భారీ రద్దీ తగ్గింది. అయితే, గత అర్థరాత్రి వరకు సుమారు 70 వేల వాహనాలు హైదరాబాద్ వైపు వెళ్లినట్లు సమాచారం.
సంక్రాంతి ముగియడంతో ఏపీ నుంచి నగరానికి వచ్చే వాహనాల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో, పంతంగి టోల్ ప్లాజాలో మొత్తం 16 బూత్‌లలో హైదరాబాద్ వైపు 9 బూత్‌లను టోల్ సిబ్బంది తెరిచారు. ఇదే సమయంలో ట్రాఫిక్ పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు డైవర్షన్లు అమలు చేశారు.
చిట్యాల వద్ద కొత్త బ్రిడ్జి నిర్మాణం కొనసాగుతుండటంతో ట్రాఫిక్ అంతరాయం మరింత పెరిగింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రద్దీని తగ్గించేందుకు మూడు లైన్లలో వాహనాలను మళ్లించారు. కోదాడ, నల్లగొండ బైపాస్‌ల వద్ద డైవర్షన్లు ఏర్పాటు చేశారు.
కచ్చా రహదారుల పై వాహనాలను మళ్లించడంతో దుమ్ము తీవ్రంగా లేచి, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!