

హైదరాబాద్‌లోని హోటల్ దస్పల్లాలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు, డీలర్లతో తెలంగాణ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి, జెటిసి రమేష్‌తో పాటు వివిధ EV వెహికల్స్ కంపెనీల ప్రతినిధులు గోపాల కృష్ణ, సురేష్ రెడ్డి, గౌతం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “ఢిల్లీ లాంటి కాలుష్య పరిస్థితులు హైదరాబాద్‌కు రాకుండా ఉండాలంటే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం తప్పనిసరి” అని అన్నారు. జీఓ నెం.41 కింద తీసుకువచ్చిన EV వెహికల్స్ పాలసీ ద్వారా ఇప్పటివరకు 1,59,304 వాహనాలకు రూ.806.35 కోట్ల మేర రాయితీలు ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వానికి పన్నుల రూపంలో నష్టం వచ్చినప్పటికీ, కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడటమే లక్ష్యమని స్పష్టం చేశారు. విజన్–2047 నాటికి జీరో ఉద్గారాల దిశగా తీసుకుంటున్న చర్యలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని చెప్పారు.
హైదరాబాద్ ఓఆర్ఆర్ బయట పెరుగుతున్న కొత్త కాలనీలను దృష్టిలో పెట్టుకొని జీఓ నెం.263 కింద 20 వేల ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ఆటోలు, 10 వేల సిఎన్జీ ఆటోలు, 10 వేల ఎల్పీజీ ఆటోలు, 25 వేల రెట్రోఫిటెడ్ EV ఆటోలుకు అనుమతులు ఇచ్చామని మంత్రి తెలిపారు. నగరంలో ఈవీ వాహనాలకు అవసరమైన ఛార్జింగ్ స్టేషన్లు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని, షోరూమ్‌లు, పెట్రోల్ బంకులు, ఇతర ప్రాంతాల్లో ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య పెంచాలని సూచించారు. జనవరిలో నిర్వహించే రోడ్ సేఫ్టీ మంత్‌లో కంపెనీలు, డీలర్లు భాగస్వాములు కావాలని, స్కూల్ పిల్లలకు అవగాహన కల్పించాలని కోరారు. నగరంలో 2,800 ఎలక్ట్రిక్ బస్సులు రానుండగా ఇప్పటికే 700 బస్సులు నడుస్తున్నాయని, 326 కొత్త ఆర్టీసీ రూట్లు ప్రారంభమయ్యాయని తెలిపారు. స్క్రాప్ పాలసీ, ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు, చెక్‌పోస్టుల తొలగింపు వంటి సంస్కరణలు అమల్లో ఉన్నాయని చెప్పారు. EV వాహనం కొనుగోలు చేసే ప్రతి వ్యక్తికి ఒక మొక్క ఇచ్చే కార్యక్రమం చేపట్టాలని సూచిస్తూ, ప్రభుత్వ వాహనాల్లో కనీసం 20 శాతం ఈవీలుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని, పర్యావరణ పరిరక్షణలో EV కంపెనీలు ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించాలని పిలుపునిచ్చారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!