

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో అవకతవకలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్‌పై దాఖలైన పిటిషన్‌లపై తెలంగాణ హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించనుంది. ఈ కమిషన్‌ను 2024 మార్చి 14న జారీ చేసిన జీవో 6 ద్వారా ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, ఐఏఎస్ అధికారులు స్మితా సభర్వాల్, ఎస్.కె. జోషి పిటిషన్‌లు దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌ల ధర్మాసనం మార్చి 12న విచారణ పూర్తి చేసి తీర్పు రిజర్వు చేసింది.
పిటిషనర్లు కమిషన్ విచారణలో విధివిధానాలు పాటించలేదని, తమ వాదనలు వినకుండా అభియోగాలు మోపారని వాదించారు. ప్రజాప్రయోజనాల పేరుతో వ్యక్తిగత ప్రతిష్ఠలకు భంగం కలిగించడం సరికాదని తెలిపారు. మరోవైపు ప్రభుత్వం తరఫు న్యాయవాదులు, ప్రజాప్రయోజనాల దృష్ట్యా కమిషన్ ఏర్పాటు చేశామని సమర్థించారు. ముందుగా ప్రకటించిన తేదీకి తీర్పు సిద్ధం కాకపోవడంతో వాయిదా పడిన ఈ కేసులో తుది నిర్ణయం ఇప్పుడు వెలువడనుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!