

రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల అభివృద్ధి, టెంపుల్ టూరిజం ప్రోత్సాహంపై దేవాదాయ శాఖ దృష్టి సారించింది. ప్రధాన దేవాలయాలకు మరింత ఆకర్షణ కల్పించేందుకు సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో సుమారు రూ.400 కోట్ల బడ్జెట్తో పలు ఆలయాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. చెరువుగట్టు, కొండగట్టు, భద్రాచలం, వేములవాడ వంటి ముఖ్యమైన ఆలయాలకు అధిక నిధులు కేటాయించారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ విమాన గోపురంపై బంగారు తాపడం పనులు వేగంగా సాగుతున్నాయి. దేవస్థానం దగ్గరున్న 25 కిలోల బంగారంతో పాటు భక్తులు విరాళంగా ఇచ్చిన 35 కిలోల బంగారాన్ని ఉపయోగిస్తున్నారు. గోల్డ్ ప్లేటింగ్ తయారీ, అమరిక సహా మొత్తం రూ.8 కోట్ల వ్యయాన్ని ప్రభుత్వం భరిస్తోంది. రానున్న బ్రహ్మోత్సవాల నాటికి ఈ పనులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు.
అలాగే 17 ఎకరాల్లో రూ.43.79 కోట్లతో వేదపాఠశాల నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. యాత్రికుల సౌకర్యార్థం 101 ఎకరాల భూమిని వసతి గృహాల కోసం సేకరించనున్నారు. కొండపై డార్మెటరీ హాల్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. వైటీడీఏ కోసం ప్రత్యేక చట్టం అమలులోకి రావడం వల్ల పరిపాలనలో పారదర్శకత పెరిగింది.
వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.76 కోట్లు కేటాయించింది. ఇందులో అన్నదానం కేంద్రం నిర్మాణానికి రూ.35.25 కోట్లు, బద్ది పోచమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధి, గుడి చెరువు సుందరీకరణకు మరో రూ.20 కోట్లు కేటాయించారు.
భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామివారి దేవాలయ విస్తరణలో భాగంగా భూ సేకరణకు రూ.60.20 కోట్లు విడుదల చేశారు. వరంగల్లోని శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో మాడవీధుల నిర్మాణానికి రూ.30 కోట్లు కేటాయించి, పనులను వేగవంతం చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి రూ.12.15 కోట్లు మంజూరయ్యాయి. మహబూబ్ నగర్లోని కురుమూరి జాతర సందర్భంగా ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లే రహదారి నిర్మాణానికి రూ.110 కోట్లతో పనులు కొనసాగుతున్నాయి.
ఖమ్మం జిల్లాలోని వైరా స్థాన గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ వేదిక, అభిషేక మండపం, వసతి గృహాల నిర్మాణానికి రూ.3.20 కోట్లు కేటాయించారు. కామారెడ్డి జిల్లాలోని సలాబత్పూర్ శ్రీ మారుతీ మందిర్కు సంబంధించిన కల్యాణమండపం, ప్రకారమండపం, కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.6.70 కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించారు.










కామెంట్స్ (1)
టెంపుల్ టూరిజంకి బలాన్నిస్తుంది