

ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో వివిధ రంగాల్లో భాగస్వామ్యం చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గూగుల్ ఆసియా పసిఫిక్ ఏరియా ప్రెసిడెంట్ సంజయ్ గుప్తాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయం, స్టార్టప్‌లు, వాతావరణ మార్పు వంటి కీలక అంశాలపై సమగ్రంగా చర్చించారు. వ్యవసాయంపై క్లైమేట్ చేంజ్ ప్రభావం, పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న కాలుష్య సమస్యల పరిష్కారానికి టెక్నాలజీ ఆధారిత సహకారం అందించేందుకు గూగుల్ సిద్ధంగా ఉందని సంజయ్ గుప్తా తెలిపారు.
ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న CURE, PURE, RARE అభివృద్ధి నమూనాలను వివరించారు. కోర్ హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దే ప్రణాళికలతో పాటు, ట్రాఫిక్ కంట్రోల్, సైబర్ భద్రత, స్టార్టప్ ఇన్నోవేషన్ రంగాల్లో పరస్పర సహకార అవకాశాలను ప్రస్తావించారు. హైదరాబాద్‌లో తొలి గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్ ఏర్పాటు చేసినందుకు గూగుల్ బృందానికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొని, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఏఐ పాఠ్యాంశాలు, హైస్పీడ్ ఇంటర్నెట్ వంటి ప్రభుత్వ కార్యక్రమాలను వివరించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!