

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)ను మూడుగా విభజించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నెల 10న సంబంధిత ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. ప్రస్తుత జీహెచ్ఎంసీ కార్యవర్గం గడువు ఫిబ్రవరి 10తో ముగియనుండటంతో అదే రోజు శేరిలింగంపల్లి, హైదరాబాద్, మల్కాజిగిరి పేర్లతో మూడు కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్తగా ఏర్పాటు చేసే కార్పొరేషన్లకు ఫిబ్రవరి 10 నుంచి ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, ఆగస్టులోపు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే అవకాశముంది.
రాజధాని హైదరాబాద్ నగర అభివృద్ధిని వేగవంతం చేయడం మరియు పరిపాలనా సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో బాహ్య వలయ రహదారి పరిధిలోని 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేశారు. అయితే, విస్తృత పరిధి కారణంగా పరిపాలనలో ఇబ్బందులు తలెత్తడంతో మూడుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మున్సిపల్ మరియు పోలీసు శాఖల సరిహద్దులు సమానంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ జరిగింది. రాచకొండను మల్కాజిగిరిగా మార్చడంతో పాటు ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఐఏఎస్ అధికారులు వినయ్‌కృష్ణారెడ్డి, సృజనలను అదనపు కమిషనర్లుగా జీహెచ్ఎంసీకి బదిలీ చేయగా, వీరిని మల్కాజిగిరి, శేరిలింగంపల్లి ప్రత్యేక కమిషనర్లుగా నియమించే అవకాశం ఉంది. ప్రస్తుత కమిషనర్ కర్ణన్ తన పదవిలో కొనసాగనున్నట్లు సమాచారం.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!