

దేశ రాజధాని ఢిల్లీ లో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ఢిల్లీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు గరిష్ఠంగా 50 శాతం సిబ్బందితోనే పనిచేయాలని ఆదేశించింది. ఈ మేరకు అన్ని సంస్థలు తమ ఉద్యోగుల్లో కనీసం సగం మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని తప్పనిసరిగా కల్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే అత్యవసర సేవలకు సంబంధించిన విభాగాలకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపింది.
ఇప్పటికే అమల్లో ఉన్న జీఆర్ఏపీ-3, జీఆర్ఏపీ-4 నిబంధనల కారణంగా ఉపాధి కోల్పోయిన కార్మికులకు రూ.10 వేల నష్టపరిహారం చెల్లిస్తామని ఢిల్లీ కార్మిక శాఖ మంత్రి కపిల్ మిశ్ర ప్రకటించారు. గత 16 రోజులుగా ఈ నిబంధనలు అమల్లో ఉండటంతో అనేక మంది కార్మికులు ప్రభావితమయ్యారని తెలిపారు.
ఇదిలా ఉండగా, కాలుష్య నియంత్రణ ధ్రువపత్రం (PUC) లేని వాహనాలకు గురువారం నుంచి ఢిల్లీ పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ఢిల్లీ వెలుపల రిజిస్ట్రేషన్ అయిన, బీఎస్-4 ప్రమాణాలు పాటించని ప్రైవేటు వాహనాలకు రాజధానిలోకి ప్రవేశం నిషేధం విధించారు.
కాలుష్యాన్ని మరింత తగ్గించేందుకు ఢిల్లీ సరిహద్దుల్లో ఉన్న 9 టోల్ ప్లాజాలను మూసివేయడం లేదా తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు తరలించడం సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సుప్రీంకోర్టు సంబంధిత అధికారులను సూచించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!