
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) సిట్ (SIT) విచారణకు హాజరుకావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ పరిణామంతో రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. గత కొన్ని రోజులుగా నోటీసుల చుట్టూ సాగుతున్న వివాదానికి రేపటితో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో ఉన్న కేసీఆర్, ఆదివారం ఉదయం హైదరాబాద్ బంజారాహిల్స్ నందినగర్‌లోని తన నివాసానికి చేరుకోనున్నారు. 65 ఏళ్లు దాటిన వారిని ఇంటి వద్దే విచారించాలన్న నిబంధన ప్రకారం, కేసీఆర్ తన ఇంట్లోనే అధికారులకు అందుబాటులో ఉంటారు. సిట్ విచారణకు ముందు ఆయన తన ముఖ్య అనుచరులు, న్యాయ నిపుణులతో భేటీ కానున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలతో కలిసి రాజకీయంగా తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
న్యాయవాదులతో చర్చించిన అనంతరం, అధికారుల ప్రశ్నలకు ఎలా సమాధానం ఇవ్వాలి, చట్టపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టత తెచ్చుకుని మధ్యాహ్నం 3 గంటలకు సిట్ అధికారులకు అందుబాటులోకి రానున్నారు. కేసీఆర్ నివాసం గోడపై అర్ధరాత్రి సిట్ అధికారులు నోటీసులు అంటించడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ స్వయంగా విచారణకు హాజరై ప్రభుత్వానికి, పోలీసులకు గట్టి సమాధానం ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం. సిట్ విచారణ నేపథ్యంలో తెలంగాణ భవన్ వద్ద ఏర్పాట్లను ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు, కర్నె ప్రభాకర్, తలసాని సాయికిరణ్ యాదవ్, మన్నె గోవర్ధన్ తదితర నేతలు పరిశీలించారు. కేసీఆర్‌ను సిట్ విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చి, వేల సంఖ్యలో తెలంగాణ భవన్‌కు రావాలని పార్టీ క్యాడర్‌ను కోరింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!