

రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు జాతీయ రహదారుల వెంట ఈవీ ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద మొత్తం 444 ఛార్జింగ్ కేంద్రాలను దశల వారీగా ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్లు, జెన్కో, డిస్కంల వద్ద ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించి ఫిబ్రవరి తొలి వారంలో కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. అనంతరం కేంద్ర బృందం సుమారు 200 ప్రదేశాలను పరిశీలించి తొలి దశలో 135 చోట్ల ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది.
ఈ కేంద్రాల్లో సుమారు 600 ఛార్జింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కేంద్రంలో కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, భారీ వాహనాలు వంటి వివిధ రకాల ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ సదుపాయం కల్పించనున్నారు. ఏప్రిల్‌లో టెండర్లు పిలిచి గుత్తేదారులకు పనులు అప్పగించనున్నట్లు నూతన పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ నెడ్‌క్యాప్ అధికారులు తెలిపారు. జూలై లేదా ఆగస్టు నాటికి ఈ కేంద్రాలను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఒక్కో ఛార్జింగ్ కేంద్రం ఏర్పాటుకు సుమారు రూ.50 లక్షల వ్యయం అవుతుందని అంచనా. ఇందులో 80 శాతం ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. మిగిలిన 20 శాతం రాష్ట్ర వాటాగా డిస్కంలు సమకూర్చనున్నాయి. సరఫరా, ఏర్పాటు, నిర్వహణ విధానంలో ఐదేళ్లపాటు ఈ కేంద్రాలను నిర్వహించేందుకు టెండర్ ద్వారా ఆపరేటర్లను ఎంపిక చేస్తారు. నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగం డిస్కంలకు వెళ్తుంది. ఒప్పందం ప్రకారం కొంత మొత్తాన్ని ఆపరేటర్లకు చెల్లిస్తారు. రెండో దశలో నగర ప్రాంతాల్లో మరిన్ని ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాల్లో అనువైన ప్రదేశాలను నెడ్‌క్యాప్ గుర్తించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సుమారు 6 వేల ఎలక్ట్రిక్ కార్లు, 4 వేల ఆటోలు, 40 వేల ద్విచక్ర వాహనాలు కొత్తగా రోడ్లపైకి వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. వచ్చే ఏడాదిన్నరలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అంచనా. దీనికి అనుగుణంగా ఛార్జింగ్ సదుపాయాలను విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!