

ఈపీఎఫ్ (ఉద్యోగ భవిష్య నిధి) చందాదారులకు మరింత సౌలభ్యం కల్పించేలా కొత్త విధానం త్వరలో అమల్లోకి రానుంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలోకి పీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకునే అవకాశం అందుబాటులోకి రానుందని ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం పీఎఫ్ విత్‌డ్రా కోసం క్లెయిమ్ ఫారాలు సమర్పించి కొన్ని రోజుల పాటు వేచి చూడాల్సి వస్తోంది. అయితే కొత్త విధానంతో యూపీఐ పిన్ ద్వారా క్షణాల్లోనే బ్యాంక్ ఖాతాకు నగదు బదిలీ చేసుకునే అవకాశం కలుగనుంది.
ఈ విధానంలో పీఎఫ్ మొత్తంలో కొంత భాగాన్ని మినహాయించి, మిగిలిన అర్హత కలిగిన మొత్తాన్ని విత్‌డ్రాకు అనుమతిస్తారు. ఈపీఎఫ్ ఖాతాతో అనుసంధానమైన బ్యాంక్ ఖాతా ద్వారా ఎంత మొత్తం ఉపసంహరించుకోవచ్చో తెలుసుకొని, యూపీఐ ద్వారా నేరుగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బ్యాంక్ ఖాతాలోకి వచ్చిన నగదును యూపీఐ చెల్లింపులకు వినియోగించుకోవచ్చు లేదా డెబిట్ కార్డు ద్వారా ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఈ విధానం సజావుగా అమలయ్యేలా అవసరమైన సాఫ్ట్వేర్ మార్పులపై ఈపీఎఫ్ఓ దృష్టి సారించినట్లు సమాచారం. ఇప్పటికే పీఎఫ్ విత్‌డ్రా ప్రక్రియను వేగవంతం చేసేందుకు పలు సంస్కరణలు చేపట్టింది. ఆటో సెటిల్మెంట్ పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచడం వల్ల, మానవ జోక్యం లేకుండా మూడు రోజుల్లోనే నగదు ఖాతాకు చేరుతోంది.
అలాగే పాక్షిక ఉపసంహరణలకు సంబంధించి గతంలో ఉన్న 13 రకాల క్లిష్ట నిబంధనలను సరళీకరించారు. అత్యవసర అవసరాలు (అనారోగ్యం, విద్య, వివాహం), గృహ అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు అనే మూడు విభాగాలుగా వర్గీకరించారు. ఈ కేటగిరీల కింద అర్హత ఉన్న బ్యాలెన్స్‌లో కనీసం 25 శాతం నిల్వ ఉంచి, 100 శాతం వరకు నగదును విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!