

ఉద్యోగుల భవిష్య నిధి చందాదారులకు కీలకమైన శుభవార్త. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈపీఎఫ్‌లో ఉన్న సొమ్మును యూపీఐ పేమెంట్ గేట్‌వే ద్వారా నేరుగా తమ బ్యాంకు ఖాతాల్లోకి ఉపసంహరించుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ సౌలభ్యం కోసం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ సరికొత్త మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేస్తోంది.
ఈ కొత్త యాప్ ద్వారా చందాదారులు తమ ఈపీఎఫ్ ఖాతాలోని సొమ్ములో కొంత భాగాన్ని మినహాయించి, మెజారిటీ మొత్తాన్ని యూపీఐ ద్వారా బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టుపై కార్మిక శాఖ ప్రత్యేకంగా పనిచేస్తోంది.
కొత్త ఈపీఎఫ్ఓ యాప్‌లో యూపీఐ ద్వారా ఉపసంహరణతో పాటు, పాస్‌బుక్ బ్యాలెన్స్ చూసుకోవడం వంటి ఇతర సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయడానికి ఎంత మొత్తంలో ఈపీఎఫ్ అందుబాటులో ఉందో చందాదారులు ముందుగానే తెలుసుకునే వీలుంటుంది.
లావాదేవీలు సురక్షితంగా పూర్తయ్యేందుకు, బ్యాంకు ఖాతాలకు నిధులు చేరేందుకు లింక్ చేసిన యూపీఐ పిన్ను తప్పనిసరిగా వినియోగించాల్సి ఉంటుంది. సేవల నాణ్యతను మెరుగుపరచడం, సాంకేతిక లోపాలను గుర్తించి సరిచేయడం కోసం ప్రస్తుతం 100 డమ్మీ ఖాతాలతో ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అన్ని పరీక్షలు విజయవంతంగా పూర్తయిన అనంతరం, ఈ ఏడాది ఏప్రిల్‌లో కొత్త ఈపీఎఫ్ఓ మొబైల్ యాప్‌ను అధికారికంగా ప్రారంభించేందుకు కార్మిక శాఖ సన్నద్ధమవుతోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!