

శబరిమల ఆలయ బంగారం చోరీ కేసులో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) మంగళవారం కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తృత సోదాలు చేపట్టింది. మొత్తం 21 ప్రాంతాల్లో తనిఖీలు ప్రారంభించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉన్నికృష్ణన్‌తో పాటు దేవశ్వం బోర్డు మాజీ అధ్యక్షుడు ఎ. పద్మకుమార్‌కు సంబంధించిన స్థలాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. నిధులు మళ్లించిన తీరు, లబ్ధిదారులు ఎవరో గుర్తించేందుకు కీలక ఆధారాలను సేకరిస్తున్నారు.
ఇదే సమయంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కూడా విచారణను ముమ్మరం చేసింది. శబరిమల ఆలయ సన్నిధానంలోని బంగారు తాపడాల నాణ్యతను పరిశీలించేందుకు త్వరలో శాంపిల్స్ సేకరించనుంది. తాపడాల పునరుద్ధరణలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై కేరళ పోలీసులు ముందుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, దాని ఆధారంగా ఈడీ పీఎంఎల్ఏ చట్టం కింద కేసు నమోదు చేసింది. దేవశ్వం బోర్డు అధికారులు, మధ్యవర్తులు, జువెలర్స్ కలిసి భారీ కుట్రకు పాల్పడ్డారన్న అనుమానంతో దర్యాప్తు కొనసాగుతోంది. బంగారు తాపడాలను రాగి తాపడాలుగా రికార్డుల్లో చూపించి మోసం చేసినట్టు ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!